నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు) నేను కాదు, సప్త ధాతువులు (రక్త, మాంస,మేదో,ఆస్థి,మజ్జా,రస,శుక్రములు) నేను కాదు. పంచకోశాలు (అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయ) నేను కాదు. కర్మేంద్రియాలు (వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థ) నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నాలో రాగద్వేషములు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని, నేను శివుడిని.
No comments:
Post a Comment